: చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లనేలేదట!
తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా 'ఖైదీ నంబర్ 150' ప్రిరిలీజ్ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెళ్లని విషయం తెలిసిందే. చాలా రోజులుగా చిరంజీవికి ఆయన దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బుధవారం సాయంత్రం చిరంజీవి ఇంటికి పవన్ వెళ్లారని... ఆయనతో కలసి డిన్నర్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వీరిద్దరూ చర్చించారంటూ కథనాలు వచ్చాయి. అయితే ఇదంతా ఉత్తిదే అంటూ కొందరు చెబుతున్నారు.
వాస్తవానికి గురువారం సాయంత్రం నుంచి చిరంజీవి ఓ ఫంక్షన్లో ఉన్నారట. అర్ధరాత్రి వరకు ఆ ఫంక్షన్ కొనసాగిందట. ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయవేత్త టి సుబ్బిరామిరెడ్డి. చిరంజీవి సినిమా 'ఖైదీ నంబర్ 150' ఘన విజయం సాధించిన నేపథ్యంలో సుబ్బిరామిరెడ్డి ఈ పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ పార్టీకి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారని చెబుతున్నారు. వీరిలో చిరంజీవి స్నేహితుడు హీరో నాగార్జున కూడా ఉన్నారట. ఈ నేపథ్యంలో, చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారనటం కేవలం రూమర్ మాత్రమే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ చిరంజీవి ఇంటికి పవన్ వెళ్లినా... డిన్నర్ చేయడం, సుదీర్ఘంగా రాజకీయాలపై చర్చించడం మాత్రం పుకారేనని వారు కొట్టిపారేస్తున్నారు.