: ఒక్క ఫొటో కేటీఆర్ ను కదిలించేసింది!


కేవలం ఒక్క ఫొటో టీఎస్ మంత్రి కేటీఆర్ ను కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే, ఉదయం నిద్రలేవగానే ఇంట్లో హడావుడి మొదలవుతుంది. కారణం పిల్లల స్కూల్. ఏడింటికే పిల్లలను రెడీ చేయాలి. ఎందుకంటే 8 గంటల కల్లా చాలా స్కూల్స్ ప్రారంభమవుతాయి. కొంత మంది పిల్లలు స్కూల్ బస్సులో వెళతారు. మరికొంత మంది ఆటోల్లో వెళతారు. ఇంత ఉదయాన్నే చిన్నారులు నిద్ర లేచి, రెడీ కావాలంటే... చిన్న వయసులో ఇది వారికి నరకయాతనే. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ, హైదరాబాదుకు చెందిన సురేన్ దంపతులు ఓ ఫొటోను మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.

పిల్లలను ఉదయాన్నే నిద్రలేపడం ఎంతో బాధాకరమని... వాళ్ల స్కూల్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చేయాలని కేటీఆర్ కు విన్నవించారు. ఆ ఫొటో చూసిన కేటీఆర్ కదిలిపోయారు. 'గుండెల్ని తాకే ఫొటో ఇది' అంటూ ఆయన స్పందించారు. పిల్లలకు బాల్యం చాలా అవసరమని... వారిని ప్రెజర్ కుక్కర్ వాతావరణంలో పెంచకూడదని అన్నారు. పిల్లల స్కూల్ టైమింగ్ మార్చాలన్న దానిపై సానుకూలంగా స్పందించారు. మరోవైపు సురేన్ దంపతుల ట్వీట్ పై అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ... వారికి మద్దతు పలుకుతున్నారు.  

  • Loading...

More Telugu News