: మహిళను బెదిరించి పాత నోట్లు తీసుకున్న ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు
హైదరాబాద్ లోని మాదాపూర్ సమీపంలో మహిళను బెదిరించి పాతనోట్లు తీసుకున్న ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. నిన్న రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టిన క్రమంలో ఓ మహిళ కారును ఆపారు. ఆ సమయంలో ఆమె వద్ద రూ.10 లక్షల పాత నోట్లు ఉండటాన్ని విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు విక్రమ్ రెడ్డి, ధన్ సింగ్, పవన్ గుర్తించారు.
పాతనోట్లు కలిగి ఉండటం నేరమని, జైలు శిక్ష పడుతుందంటూ ఆమెను బెదిరించి రూ.8 లక్షల పాతనోట్లను తీసుకుని, మిగిలిన రెండు లక్షలను ఆమెకు తిరిగి ఇచ్చివేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. మహిళను బెదిరించి ఆ సొమ్ము తీసుకున్న విషయం నిజమేనని తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.