: పెళ్లికి ఒప్పుకోనందుకు... యువతిని 12 సార్లు పొడిచిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కుమారుడు
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటుచేసుకుంది. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిని (21) అత్యంత ఘోరంగా కత్తితో 12 పోట్లు పొడిచాడో దుర్మార్గుడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు అమిత్. పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కుమారుడు. వాస్తవానికి ఇతనికి ఇంతకు ముందే పెళ్లయింది. అయినా, తన బంధువు అయిన మరో యువతిని పెళ్లి చేసుకోవాలంటూ వెంట పడుతున్నాడు.
తన ప్రతిపాదనకు ఆమె ఒప్పుకోకపోవడంతో... ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి, కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు అమిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీసీపీ రిషి పాల్ తెలిపారు. మరో విషయం ఏమిటంటే, జనవరి 6వ తేదీన కూడా విషపు మాత్రలు కలిపిన కేక్ ను ఆ యువతికి అమిత్ బలవంతంగా తినిపించాడట. ఈ విషయం పోలీసు విచారణలో తేలింది.