: టెక్నాలజీలో మేమే ముందు.. మాతో చేతులు కలపండి.. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
టెక్నాలజీలో తాము అందరికంటే ముందున్నామని, అదే తమ బలమని, తమతో కలిసి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి ఆ దిశగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాంకేతికంగా తాము చాలా బలంగా ఉన్నామని, మరిన్ని కొత్త ఆలోచనలు, సహకారం కావాలని ఇతర దేశాల ప్రతినిధులను కోరారు.
గురువారం ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అంశంపై ప్రసంగించిన చంద్రబాబు, పాలనలో టెక్నాలజీ సాయాన్ని విరివిగా ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలను కోర్ డ్యాష్ బోర్డుతో అనుసంధానించామని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా వీధి దీపాలు వెలగకపోయినా తమకు తెలిసిపోతుందన్నారు. టెక్నాలజీతో అక్రమాలను అరికట్టడం వల్ల గతేడాది 10.99 శాతం వృద్ధిరేటు సాధించినట్టు వివరించారు. ఈ ఏడాది 15 శాతం వృద్ధిరేటు సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత్‌లో ఏపీ చాలా బలమైన రాష్ట్రమని, పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.