: పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడ్డా!: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
వెలగపూడి సచివాలయానికి వెళ్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి విఫలయత్నం చేసిన సంగతి విదితమే. ఈ సంఘటనపై అఖిల ప్రియ మాట్లాడుతూ, వెలగపూడి మార్గంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రోగ్రాం ఉన్నట్టు తమకు తెలియదని అన్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు బ్లాక్ అయి ఉండటంతో ముందుకు పోలేమని, తమ కారును ఆపిన పోలీసులు తనతో చెప్పారని అన్నారు. ఈ క్రమంలో తన కారుపై దాడి చేసేందుకు, తనను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు యత్నించారని , దీంతో, తన కారు వెనక్కి వెళ్లలేకపోయిందని అన్నారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడ్డానని, దాడికి యత్నించిన వారు మద్యం తాగి ఉన్నారని తమ కారు డ్రైవర్ చెప్పాడని అన్నారు. ఈ ఘటనపై గుంటూరు ఎస్పీతో ఫోన్ లో మాట్లాడానని, లిఖిత పూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని అఖిల ప్రియ పేర్కొన్నారు.