dyavuda: 'దేవుడా' సినిమా దర్శకుడి అరెస్టు.. నిర్మాత కోసం గాలింపు
దర్శకుడు సాయిరాం దాసరి తెలుగులో తెరకెక్కిస్తున్న‘దేవుడా’ సినిమాపై భజరంగ్ దళ్ కార్యకర్తలు సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇటీవలే హైదరాబాద్, నేరేడ్‌మెట్ పోలీసులతో పాటు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌లో బీరుతో శివలింగానికి అభిషేకం, సిగరెట్‌తో ధూపం వెలిగించడం, వెంకటేశ్వర స్వామి ఫొటోను నేలకేసి కొట్టడం వంటి సన్నివేశాలు చూపించినందుకు గానూ భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు 'దేవుడా' చిత్ర దర్శకుడు సాయిరాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఈ చిత్ర నిర్మాత హరికుమార్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.