: పీటర్ ముఖర్జియా, ఈ సంసారం ఇక వద్దు... విడాకులు కోరిన ఇంద్రాణి
కన్న కూతురు షీనా బోరాను అత్యంత పాశవికంగా హత్య చేసి భారత కార్పొరేట్ రంగంలో సంచలనమైన ఇంద్రాణి ముఖర్జియా, ఇప్పుడు తన మూడవ భర్త పీటర్ ముఖర్జియా నుంచి విడాకులు కోరుతోంది. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాపై హత్య కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడిక తన భర్త పీటర్ తో కలిసుండలేనని కేసు విచారణ జరుగుతున్న ప్రత్యేక కోర్టుకు ఇంద్రాణి తెలియజేసింది.
పీటర్ తో విడాకులు కోరుతూ, ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నానని, అందుకు అనుమతించాలని కోరింది. తన ఆస్తులన్నీ చారిటీ సంస్థలకు ఇస్తూ విల్లును మార్చి రాయాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ఇక, విల్లును మార్చి రాసేందుకు, విడాకుల పిటిషన్ దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి అక్కర్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, అదే సమయంలో కోర్టులో పీటర్ కూడా ఉన్నప్పటికీ, కనీసం ఇంద్రాణిని పలకరించ లేదని తెలుస్తోంది.
తనకు, తన మాజీ భర్తకు పుట్టిన బిడ్డ షీనా బోరా, మూడో భర్త పీటర్ ముఖర్జియా కుమారుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో, ఏప్రిల్ 24, 2012న ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలు ఆమెను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆపై దాదాపు సంవత్సరం తరువాత ఈ కేసు వెలుగులోకి రాగా, అప్పటి నుంచి ఇంద్రాణి జైల్లోనే ఉంది.