: నాతో తలపడి గెలువు.. యోగా పవర్ ఏంటో చూపిస్తా... ఒలింపిక్స్ విజేతైన రెజ్లర్ కు రాందేవ్ బాబా సవాల్.. ఈ రోజే మ్యాచ్!


మీరు చదివింది నిజమే. యోగాసనాలలో నిష్ణాతుడైన బక్కపలుచటి రాందేవ్ బాబా ఏకంగా ఓ రెజ్లర్ కు సవాల్ విసిరారు. అందులో తాను సవాల్ విసిరింది ఆషామాషీ రెజ్లర్ కు కాదు. 2008 ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్ కు. వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం పతంజలి ప్రోవీటా ప్రో రెజ్లింగ్ జరుగుతోంది. ఇందులో జైపూర్ నింజాస్, హర్యానా హేమర్స్ జట్లు సెమీస్ లో తలపడనున్నాయి. ఈ సెమీస్ కు ముందు రాందేవ్ బాబా, ఆండ్రీ స్టాడ్నిక్ ల మధ్య ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతోంది. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ, గతంలో తాను జాతీయ స్థాయి రెజ్లర్లతో తలపడ్డానని... అంతర్జాతీయ స్థాయి రెజ్లర్ తో పోటీ పడుతుండటం ఇదే తొలిసారని చెప్పారు. తాను ప్రతి రోజు వ్యాయామం చేస్తానని... సమయం చిక్కినప్పుడల్లా అఖాడాకు వెళ్లి రెజ్లింగ్ చూస్తానని తెలిపారు. ఈ మ్యాచ్ లో రియల్ యోగా పవర్ ఏంటో చూస్తారని అన్నారు.

మరోవైపు, రాందేవ్ బాబా విసిరిన సవాల్ తెలిసి రెజ్లర్ ఆండ్రీ ఆశ్చర్యపోయాడట. చివరకు బాబాతో పోటీ పడాల్సిందే అని నిర్ణయించుకున్నాడట. రాందేవ్ బాబా రెజ్లర్లతో పోటీ పడటం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇండియన్ స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ తో కూడా బాబా పోటీ పడ్డారు. ఆ మ్యాచ్ తర్వాత సుశీల్ మాట్లాడుతూ, రెజ్లింగ్ ను బాబా సీరియస్ గా తీసుకుంటే కనుక మన దేశంలోనే అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరుగా నిలుస్తారంటూ కితాబిచ్చాడు. రాందేవ్ బాబానా... మజాకానా!

  • Loading...

More Telugu News