: పార్టీ ఆఫీసు ఏపీకి రాదెందుకు?.. వైసీపీ అధినేత‌పై సీనియ‌ర్‌ నేత‌ల అసంతృప్తి!


వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీరుపై పార్టీ సీనియ‌ర్ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండేళ్లు పూర్త‌య్యాయి. ఏపీ పాల‌న మొత్తం వెలగ‌పూడి నుంచే జ‌రుగుతోంది. జాతీయ పార్టీలు త‌మ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను కూడా అమ‌రావ‌తి  ప‌రిస‌రాల్లో ఏర్పాటు చేసుకున్నాయి. అయినా ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్సార్ సీపీ ఇంకా హైద‌రాబాద్‌ను వ‌ద‌ల‌క‌పోవ‌డంతో సీనియ‌ర్ నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక్క‌డే ఉండ‌డం వ‌ల్ల ఒన‌గూరే ప్ర‌యోజ‌నాలు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికైనా ఏపీకి త‌ర‌ల‌కుంటే 2019 ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా భారీ  న‌ష్టం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

2019లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా క‌ష్ట‌ప‌డుతున్న వైసీపీ చీఫ్ ఇంకా హైద‌రాబాద్‌ను విడిచిపెట్ట‌క‌పోవ‌డంపై సీనియ‌ర్ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాలంటే ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు రావాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు. ఇక్క‌డికొచ్చి పార్టీ కార్యాల‌యంలో మాట్లాడ‌డం వ‌ల్ల సొంత రాష్ట్రంలో, సొంత రాష్ట్ర ప్ర‌జ‌ల గురించి మాట్లాడుతున్నామ‌న్న భావ‌న క‌ల‌గ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం గుంటూరులో టీడీపీ, విజ‌య‌వాడ‌లో కాంగ్రెస్‌, బీజేపీలు త‌మ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకున్నాయ‌ని, పార్టీ కార్యాల‌యం అంటూ లేని పార్టీ త‌మ పార్టీ ఒక్క‌టేన‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

అసెంబ్లీలో బ‌లాబ‌లాల ఆధారంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పార్టీ కార్యాల‌యాల కోసం భూములు కేటాయించింది. అయితే బీజేపీకి ఇచ్చినంత స్థలాన్నే వైసీపీకి ఇవ్వ‌డంపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సొంతంగా భూమి కొనుగోలు చేసి కార్యాల‌యం నిర్మించుకుందామ‌ని స‌న్నిహితుల వ‌ద్ద పేర్కొన్నారు. అయితే ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ముందడుగు ప‌డ‌క‌పోవ‌డంపై నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News