: ఎన్టీఆర్ కొడుకులు, కూతుర్లే పార్టీ మారారు...: రేవంత్ రెడ్డి, మాగంటి మధ్య ఆసక్తికర సంవాదం
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు వెళ్లిన మాగంటి గోపీనాథ్ మధ్య శాసనసభ లాబీల్లో ఆసక్తికర సంవాదం నడిచింది. 'ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు?' అంటూ మాగంటి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, తనకు ఎన్టీఆర్ గురించి ఏమీ తెలియదని, కనీసం ఆయనను దగ్గర్నుంచి చూడను కూడా చూడలేదని అన్నారు. 'పార్టీ కార్యాలయంలో కొత్త ఛాంబర్ కు వెళ్లేటప్పుడు ముందుగా పెద్దమ్మగుడికి వెళ్లి ఆ తర్వాత ఛాంబర్ లో అడుగుపెట్టావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఛాంబర్ లో అడుగుపెట్టేవాడివ'ని మాగంటి గోపీనాథ్ ఎత్తిపొడిచారు.
దీనికి బదులుగా రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, 'నువ్వు పార్టీ ఫిరాయించినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ నుంచే వెళ్లావా?' అని సెటైర్ వేశారు. దీనికి మాగంటి సమాధానమిస్తూ, ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చానని చెప్పారు. దీనికి రేవంత్ తాను పెద్దమ్మగుడినుంచి బయల్దేరినా ఎన్టీఆర్ భవన్ కే వెళ్లానని ఎత్తిపొడిచారు. దానికి మాగంటి కౌంటర్ ఇస్తూ, 'ఎన్టీఆర్ కొడుకులు, కుమార్తెలే పార్టీ మారారు' అంటూ ఎదురు సమాధానమిచ్చారు. తనకు ఎనిమిదినెలలపాటు గన్ మెన్లను ఇవ్వకపోతే టీడీపీ అసలు పట్టించుకోలేదని ఆయన నిష్టూరమాడారు.