: ముగిసిన బహిష్కరణ శిక్ష... నేడు గుజరాత్ లో కాలుమోపనున్న యువనేత హార్దిక్ పటేల్... 5 వేల వాహనాల ర్యాలీతో స్వాగతం


ఆరు నెలల రాష్ట్ర బహిష్కరణ శిక్షను అనుభవించిన గుజరాత్ యువ నేత, 23 ఏళ్ల హార్దిక్ పటేల్ నేడు తిరిగి రాష్ట్రంలో కాలుమోపనున్నారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితిని ఏర్పాటు చేసి, పటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని హార్దిక్ ప్రారంభించిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

ఆపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు, ఆరు నెలల పాటు గుజరాత్ లో కాలు మోపవద్దని ఆదేశించింది. విచారణ క్రమంలో సూరత్ జైల్లో 9 నెలలు ఉన్న హార్దిక్, ఆపై రాజస్థాన్ వెళ్లి, అక్కడ ఆరు నెలలు గడిపారు. ఇక ఆ సమయం ముగియడంతో రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లోని రత్నాపూర్ కు నేటి ఉదయం 11 గంటలకు హార్దిక్ చేరుకోనున్నారు.

ఇక హార్దిక్ కు ఘన స్వాగతం పలికేందుకు పీఏఏఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 5 వేల వాహనాలతో కూడిన కాన్వాయ్ లో ఆయన్ను రాష్ట్ర రాజధానికి తీసుకు వస్తామని పటీదార్ సంఘం నేత వరుణ్ పటేల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పటేల్ యువకులు పాల్గొంటారని తెలిపారు.

  • Loading...

More Telugu News