: మొబైల్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్!.. బ్యాటరీలు ఇక పేలిపోవు
సెల్‌ఫోన్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. తాము వాడుతున్న ఫోన్లలోని బ్యాటరీలు ఎప్పుడు పేలిపోతాయో తెలియక బిక్కుబిక్కుమంటున్న వారికి ఇక ఆ భయం లేదు. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కెమెరాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు విపరీతంగా వేడెక్కితే పేలిపోయే ప్రమాదం ఉంది. బ్యాటరీల పేలుడుపై పరిశోధన నిర్వహించిన స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అవి పేలిపోకుండా ఉండేందుకు ఏం చేయాలో గుర్తించారు.
సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీల్లో అయాన్లు పాజిటివ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ల మధ్య ఎలక్ట్రోలైట్ అనే ద్రవ పదార్థం గుండా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్లకు తేలిగ్గా మండే స్వభావం ఉంటుంది. దీంతో బ్యాటరీలు వేడెక్కితే ఎలక్ట్రోలైట్ అంటుకుని బ్యాటరీలు పేలిపోతాయి. దీంతో అగ్ని నిరోధకాలుగా పనిచేసే సూక్ష్మ ఫైబర్లతో కూడిన స్మార్ట్ షీట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని బ్యాటరీల ఎలక్ట్రోడ్ల మధ్య చొప్పించడం ద్వారా వేడిని నియంత్రిస్తారు. ఈ ప్లాస్టిక్ సెల్స్ 0.4 సెకన్లలోనే కరిగి బ్యాటరీలను చల్లారుస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు.