: సుప్రీంకోర్టుతోనే ప‌రిహాసాలా?.. దీనిని జోక్ కోర్ట‌ని అనుకుంటున్నారా?.. ఏపీపై అత్యున్న‌త న్యాయ‌స్థానం మండిపాటు


కాలుష్యం, మ‌ధ్యాహ్న భోజ‌నంలో  ప‌రిశుభ్ర‌త‌పై తాము ఇచ్చిన ఆదేశాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పందించ‌క‌పోవడంపై సుప్రీంకోర్టు మండిప‌డింది. ఈ విష‌యంలో రాష్ట్రాలు సీరియ‌స్‌గా లేవ‌ని పేర్కొంది. సుప్రీంకోర్టుతో ఎందుకు ప‌రిహాసాలాడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇది సుప్రీంకోర్టనుకుంటున్నారా? లేక జోక్ కోర్ట‌ని అనుకుంటున్నారా? అని చీఫ్ జ‌స్టిస్ జేఎస్ ఖేహ‌ర్‌, జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానించింది. గుజ‌రాత్‌కు చెందిన స్వ‌చ్ఛంద ప‌ర్యావ‌ర‌ణ సుర‌క్షా సమితి 2012లో పారిశ్రామిక కాలుష్యంపై ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసింది. 2013లో అంత‌ర్రాష్టీయ మాన‌వ అధికార నిగ్రాణి అనే మ‌రో స్వ‌చ్ఛంద సంస్థ మ‌ధ్యాహ్న భోజ‌నంలో శుభ్ర‌త‌పై పిల్ దాఖ‌లు చేసింది.

వీటిని విచారిస్తున్న అత్యున్న‌త న్యాయ‌స్థానం వీటికి కౌంట‌ర్ అఫిడ‌విట్లు దాఖ‌లు చేయాలంటూ కేంద్రం స‌హా 12 రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. మ‌ధ్యాహ్న భోజ‌నం తిని బీహార్‌లో 23 మంది చిన్నారులు మృతి చెందార‌ని, ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి తెల‌పాల‌ని ఆదేశించింది. అలాగే పారిశ్రామిక కాలుష్యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హ‌రియాణా, క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, చ‌త్తీస్‌గ‌ఢ్ త‌దిత‌ర రాష్ట్రాలు కౌంట‌ర్ అఫిడ‌విట్లు దాఖ‌లు చేయ‌లేదు. దీంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను సుప్రీంకోర్టు నిల‌దీసింది. అఫిడ‌విట్లు దాఖ‌లు చేయ‌డం ఇష్టం లేక‌పోతే, ఆ విష‌యాన్నే చెబితే రాసుకుంటామని, స‌మ‌యం కావాల‌నుకుంటే ఆ విష‌యాన్నైనా చెప్పాల‌ని పేర్కొంటూ విచార‌ణ‌ను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News