so: నకిలీ పత్రాలు సృష్టించి నాకు విదేశాల్లో ఆస్తులున్నాయన్నారు.. చర్యలు తీసుకోవాల్సిందే: సోమిరెడ్డి
వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి అసత్యప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఇటీవలే ఆ నకిలీ డాక్యుమెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోమిరెడ్డి.. ఈ రోజు శాసనమండలి ఛైర్మన్ చక్రపాణిని కలిసి ఆయనకు మరో ఫిర్యాదు లేఖను అందించారు. తాను నాలుగు దేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు నకిలీ పత్రాలను చూపిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై కుట్రలు పన్నారని ఆయన ఆరోపించారు.
తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట నకిలీ దస్తావేజులు సృష్టించారని ఫిర్యాదులో సోమిరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ వైసీపీ నేతలు మరొకరిపై ఇలాంటి ఆరోపణలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చక్రపాణిని ఆయన కోరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకూడదని, నిజాయతితో రాజకీయాలు చేయాలని ఆయన హితవుపలికారు. తనను రాజకీయంగా పతనం చేయడానికే ఇలాంటి పనులు చేశారని అన్నారు. జగన్ దగ్గర అక్రమాస్తులు ఉన్నాయని రుజువయిపోయిందని, 11 కేసులు ఆయనపై ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. అంతేగాక వైసీపీలో మొత్తం క్రిమినల్‌లను పెట్టుకున్న జగన్.. తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తూ కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు.