: ఐఐటీల్లో అమ్మాయిలకు 20 శాతం రిజర్వేషన్లు... కీలక నిర్ణయం తీసుకోనున్న జాయింట్ అడ్మిషన్ బోర్డు!
దేశవ్యాప్తంగా వున్న ఐఐటీల్లో అమ్మాయిలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, జేఏబీ (జాయింట్ అడ్మిషన్ బోర్డు) నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అమ్మాయిలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, 20 శాతం సీట్లను వారికి కేటాయించాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో నేడో రేపో ఈ నిర్ణయం వెలువడనున్నట్టు సమాచారం. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశిస్తున్న అమ్మాయిల సంఖ్య కనీస స్థాయికి పడిపోవడంతోనే కమిటీ ఈ సిఫార్సులు చేసినట్టు తెలుస్తోంది. కాగా, 2018 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలు కావచ్చని అడ్మిషన్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రొఫెసర్ తిమోతీ గొన్సాల్వేస్ నేతృత్వంలోని కమిటీ ఈ సిఫార్సులు చేసిందని, అబ్బాయిల అడ్మిషన్ల సంఖ్యకు ఆటంకం కలుగకుండా అమ్మాయిలకు రిజర్వేషన్లు దక్కేలా చూస్తామని వెల్లడించారు.