: ప్రైవేటు ట్రావెల్స్ కంటే ఆర్టీసీయే బెటరన్న కేశినేని నాని... ఎందుకని అలా అన్నారు...?
కేశినేని ట్రావెల్స్ అధినేత, ఎంపీ కేశినేని నాని స్వయంగా ప్రైవేటు ట్రావెల్స్ కంటే ఆర్టీసీయే నయమని స్పష్టం చేశారు. ట్రావెల్స్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని పరోక్షంగా పేర్కొన్నారు. అస్సాం, నాగాలాండ్, పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ అయిన బస్సులు... తిరిగేది మాత్రం విజయవాడ - హైదరాబాద్, బెంగళూరు - చెన్నై, విజయవాడ - చెన్నై మార్గాల్లో అని చెప్పారు.
సేఫ్టీ, కంఫర్ట్ ఈ రెండు విషయాల్లోనూ ప్రైవేటు ట్రావెల్స్ కంటే ఆర్టీసీయే బెటరన్నారు. ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా మనిషెత్తు లగేజీలను చేరవేస్తున్నాయని, నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ట్రావెల్స్ సంస్థలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోతున్నాయన్నారు. ఆర్టీసీ మాదిరిగా ప్రైవేటు ట్రావెల్స్ కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయన్న ఆయన... తాను ఎంపీ అయిన తర్వాత సగం బస్సులను అమ్ముకున్నట్టు కూడా చెప్పారు.