: మరోసారి స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
పెట్రోలియం ఉత్పత్తుల ధరలను చమురు కంపెనీలు వరుసగా పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. ప్రతీ పదిహేను రోజులకు ఓ సారి ధరలను ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు సవరించడం జరుగుతున్న విషయమే. ఈ క్రమంలో తాజాగా పెట్రోల్ ధరను లీటర్ 42 పైసలు, డీజల్ ధరను రూ.1.03 చొప్పున పెంచుతూ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చేశాయి. తాజా ధరలకు రాష్ట్రాల పన్నులు అదనం.
15 రోజుల క్రితం కూడా చమురు కంపెనీలు పెట్రోల్ పై 1.29, డీజిల్ పై 97 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడం వరుసగా ఇది నాలుగోసారి. అంటే గత రెండు నెలలుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తుల ధరలు, డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గుదల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.