: హైటెక్ తో భార్యను వెంటాడి... ప్రియుడిని చంపిన భర్త... తట్టుకోలేక ఉరేసుకున్న భార్య!


రాజేశ్ గౌడ (33)... దక్షిణ బెంగళూరు ప్రాంతంలో నివసించే వ్యక్తి. అతని భార్య శ్రుతి (32). వీరికి ఇద్దరు పిల్లలు కూడా. తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతోందని రాజేశ్ కు అనుమానం. దాంతో, జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సాయంతో భార్యను వెంటాడి, ప్రియుడితో ఆమె కలిసి ఉండటాన్ని చూసి అతడిని కాల్చి చంపాడు. ఆపై జరిగిన ఘటనను తట్టుకోలేక శ్రుతి ఉరేసుకుని మరణించింది.

ఈ కేసులో పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, రైల్వే గొల్లహళ్లిలో పంచాయితీ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్‌ గా శ్రుతి పనిచేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటి నుంచి బయలుదేరి హేసరఘట్ట సమీపంలో న్యాయవాది, లోకల్ పొలిటికల్ లీడర్ అయిన అమిత్‌ కేశవమూర్తిని కలుసుకుంది. వీరిద్దరూ కారులో కలిసుండగా, అమిత్ పై కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. ఆమె కారులో జీపీఎస్ పరికరాన్ని ముందే అమర్చిన రాజేశ్, తన తండ్రి గోపాలకృష్ణతో కలసి వారిని వెంటాడాడు.

ఇక కాల్పుల తరువాత అమిత్ ను శ్రుతి ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. అప్పటికే అతను మరణించినట్టు చెప్పగా, ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాను ఓ లాడ్జిలో ఉన్నట్టు పుట్టింటివారికి చెప్పిన ఆమె, అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆత్మహత్యకు దారితీసిన ఇతర కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అమిత్ ను కాల్చి చంపింది రాజేశా? లేక ఆయన తండ్రి గోపాలకృష్ణా? అన్న అనుమానం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇదిలావుండగా, ఈ రెండు కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉంటాయని, కొత్త సంవత్సరం వేడుకలు సైతం కలసి జరుపుకున్నారని, ఇంతలో ఇన్ని గొడవలు ఎలా వచ్చాయో తెలియడం లేదని అమిత్ తల్లి వాపోయింది.

  • Loading...

More Telugu News