: యువతి కడుపులో పెద్ద ఎత్తున బతికున్న వానపాములు.. షాకైన డాక్టర్లు!
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలికి చెందిన నేహా(22) అనే యువతికి పదేపదే కడుపు నొప్పి వచ్చి, వాంతులు చేసుకునేది. ఎన్నో మందులు వాడినప్పటికీ, డాక్టర్ల చుట్టూ తిరిగినప్పటికీ కడుపునొప్పి తగ్గలేదు. చివరికి భరించలేని కడుపునొప్పితో కేజీ నందా ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, ఆ యువతి పేగుల్లో ఏదో ఆడ్డుపడుతున్నట్లు గుర్తించారు. తాజాగా ఆపరేషన్ చేసి ఆమె పేగుల్లోంచి 10 అంగుళాల పొడవైన దాదాపు 150 బతికున్న వానపాములను బయటికి తీశారు. ఇలా భారీ ఎత్తున పాములు బయటపడడంతో డాక్టర్లు సైతం షాకయ్యారు.
మామూలుగా కొందరికి 3 లేదా 4 వాన పాములు మాత్రమే బయట పడతాయని, ఈ కేసులో మాత్రం ఏకంగా 150 వానపాములు బయట పడడం ఇదే తొలిసారని వైద్యులు పేర్కొన్నారు. ఇటువంటి కేసులు పెరగడానికి అనారోగ్యమైన జీవనశైలే కారణమని తెలిపారు. ఇలాంటి క్రిములు రక్తంలో ప్రవేశించి తరువాత శరీరంలోపల పెరుగుతాయని అన్నారు. ఈ వానపాములు ఆ యువతి మెదడులోకి ప్రయాణించి ఉంటే ఆమెకు ప్రాణాపాయం కలిగేదని తెలిపారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తీవ్రంగా వేధించే కడుపునొప్పి, వాంతులతో ఎంతో బాధపడిపోయానని నేహ మీడియాకు తెలిపింది. తనకు వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పింది.