: హీరోయిన్ త్రిషకు శ్రద్ధాంజలి.. హద్దు మీరిన 'జల్లికట్టు' అభిమానం!
జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జల్లికట్టుపై అభిమానం హద్దుమీరింది. జల్లుకట్టు నిషేధానికి కారణమైన 'పెటా' సంస్థపై పలువురు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆ సంస్థకు ప్రచార కార్యకర్తలైన నటీనటులపై అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'పెటా ప్రచారకర్త, హీరోయిన్ త్రిష.. ఇక లేరు' అంటూ కొందరు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది.
తనను ఉద్దేశించి కొందరు చేస్తున్న పోస్టులు చూసి షాక్ అయ్యానని చెప్పింది. స్మార్ట్ ఫోన్ లో ఈజీగా పోస్ట్ చేసే అవకాశం ఉందికదా అని... ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని చెప్పింది. ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం తమిళ సంప్రదాయమా? అని ప్రశ్నించింది. తమిళులం అని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడాలి అని వ్యాఖ్యానించింది.
జల్లికట్టు ద్వారా జంతు హింస చోటు చేసుకుంటోందని... ఆ ఆటను నిషేధించాలంటూ జంతు హక్కుల సంరక్షణ సంస్థ 'పెటా' సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో, జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది. తమ సంప్రదాయ ఆట అయిన జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును తమిళులు కోరినా ఫలితం దక్కలేదు.