: ఇది 'కథ' కాదు నిజం... ఐదుగురిపై అత్యాచారం చేసి చంపేసిన కిరాతకుడు!
సలాది లక్ష్మీనారాయణ... ఊరూరూ తిరుగుతూ దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి కథలను చెబుతుంటాడు. నోరు తెరచి కథ మొదలు పెట్టాడంటే ఎవరైనా లీనమై పోవాల్సిందే. మహిళలను టార్గెట్ చేసుకుని, వారిని తన గానంతో వశపరచుకుని, శారీరకంగా అనుభవించి, అంతటితో వదలకుండా హత్య చేసి, వారి ఒంటిపై ఉండే నగలను దోచుకోవడం ఇతని అలవాటు. ఒకటి, రెండు కాదు. ఏకంగా ఐదుగురు యువతులపై అత్యాచారం చేసి హత్యలు చేశాడు.
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామానికి చెందిన వివాహిత చేవూరి భాగ్యవతి అదృశ్యం కావడంపై కేసు నమోదు కాగా, దర్యాప్తు చేసి పోలీసులకు నిందితుడి గురించిన సమాచారం, అతని అకృత్యాలు తెలిశాయని అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య వెల్లడించారు. అమాయక మహిళలకు కథలు చెప్పి వారిని లోబరచుకుంటాడని తెలిపారు. భాగ్యవతితో పరిచయం పెంచుకుని, ఆమెను 8వ తేదీన ఇసుక దిబ్బల్లోకి తీసుకెళ్లి, అత్యాచారం చేసి, ఆపై కర్చీఫ్ తో గొంతు బిగించి చంపాడని, ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించాడని వెల్లడించారు.
తమ విచారణలో భాగంగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని మద్దురిలంకకు చెందిన ఆకుల నాగమణి (40), యానాంకు చెందిన సత్యవతి, దంగేరుకు చెందిన ఓ వివాహితతో పాటు మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన బద్రి సత్యవతిలను ఇదే పద్ధతిలో నిందితుడు కడ తేర్చాడని, అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు.