: ఇది సంప్రదాయమా?.. సరదానా?.. మనుషుల వినోదానికి జంతువుల బలి!


సంప్రదాయం పేరుతో జంతువులతో ఆడుకోవడం ఈనాటిది కాదు... అనాదిగా వస్తున్నదే. ఇది ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఇది కొనసాగుతోంది. ఇక మనదేశంలో ప్రతి సంక్రాంతికి జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేల నిర్వహణపై జరిగే గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జంతుప్రేమికుల ఆందోళనలు, కోర్టు తీర్పులు, చట్టాలను ఈ సమయంలో గంగలో కలిపేసి జంతువుల హింస(ఆట)కే అందరూ మొగ్గుచూపుతారు.  అయితే ఆట కాస్తా జూదంగా మారడమే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం.

ఇక సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే కోడి పందేల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పందెం మాటున కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. అయితే ఈ కోడి పందేలను ఒక్క ఏపీలోనే కాదు.. చైనా, ఇరాక్, జపాన్, ఫ్రాన్స్, పాకిస్థాన్, బ్రిటన్ ఆస్ట్రేలియాతోపాటు మరికొన్ని దేశాల్లోనూ నిర్వహిస్తారు.

సాధారణంగా చాలామందికి గుర్రాలతో రేసులు మాత్రమే నిర్వహిస్తారని తెలుసు. అయితే చాలా దేశాల్లో గుర్రాలతో నిర్వహించే పోటీ విచిత్రంగా ఉంటుంది. రెండు గుర్రాలు కలబడి చనిపోయేంత వరకు పోరాడతాయి. థాయ్ లాండ్, దక్షిణ కొరియా, ఐస్ ల్యాండ్, ఇండోనేసియా తదితర దేశాల్లో శతాబ్దాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

ఎడారి ఓడ ఒంటెల మధ్య పోరాటం చూడాలంటే టర్కీ వెళ్లాల్సిందే. అక్కడ నవంబరు నెలలో ప్రత్యేకంగా ఈ పోటీలు నిర్వహిస్తారు. దక్షిణాసియా, సెంట్రల్ ఆసియా సహా మరికొన్ని దేశాల్లో ఒంటెల పోటీలు జరుగుతాయి.

శునకం.. మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. దీనితోనూ నిర్వహించే పోటీలు ఉన్నాయి. చైనా, జపాన్, ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల్లో నిర్వహించే శునక పోటీలు చూసేందుకు జనాలు ఎగబడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని రకాల శునకాలను పెంచుతారు.

మనకు ఎద్దుల పోటీలు  మాత్రమే తెలుసు. రాయలసీమ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఉంటాయి. ఇక పాశ్చాత్య దేశాల్లో బుల్ ఫైట్ పేరుతో దున్నలతో మనుషులు తలపడతారు. కానీ మన దేశంలోని అస్సాంలో కోడి పందేల మాదిరిగానే దున్నల పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను సుప్రీంకోర్టు నిషేధించినా ఇక్కడ మాత్రం అవి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ బుల్ బుల్ పిట్టల మధ్య కూడా పోటీ నిర్వహిస్తుంటారు.

ఇక వీటితోపాటు నైజీరియా, ఉజ్బెకిస్థాన్, ఇండోనేసియా తదితర దేశాల్లో పొట్టేళ్ల పందెం, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, కొలంబియా, ఈక్వెడార్, వెనిజులా, మెక్సికో, పెరూ తదితర దేశాల్లో బుల్ ఫైట్, డెన్మార్క్ లోని ఫెరో దీవి సమీపంలో డాల్ఫిన్ల వేట, నెదర్లాండ్స్, బెల్జియం, ఇంగ్లండ్, అమెరికాల్లో బాతులాగుడు పోటీలు, స్పెయిన్ లోని పెరోపాలో గాడిదపై మూకుమ్మడి దాడి చేసి దాని గొంతులో మద్యం పోసే క్రీడను నిర్వహిస్తుంటారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో సాలెపురుగు నుంచి పేడపురుగుల వరకు, కీచురాళ్ల నుంచి పావురాల వరకు దేన్నీ వదలకుండా పందేలు నిర్వహిస్తున్నారు. వాటిని హింసిస్తూ దానికి సంప్రదాయం పేర్లు తగిలిస్తున్నారు.

  • Loading...

More Telugu News