: సినీ నటి త్రిష షూటింగ్ ను అడ్డుకున్న ‘జల్లికట్టు’ మద్దతుదారులు
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన దక్షిణాది నటి త్రిషకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జంతు సంరక్షణ హక్కుల చట్టం (పెటా) కార్యకర్త కూడా అయిన త్రిష, ఈ ప్రచారం చేయడంపై పలువురు మండిపడుతున్నారు. ఆమె షూటింగ్ ను అడ్డుకున్నారు. దక్షిణ చెన్నైకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని శివగంగలో ఆమె నటిస్తున్న ‘గర్జన’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అక్కడికి వెళ్లిన ‘జల్లికట్టు’ మద్దతుదారులు ఆ షూటింగ్ ను అడ్డుకున్నారు. కార్వాన్ లో ఉన్న త్రిషను బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లడంతో పరిస్థితి చక్కబడింది. అయితే, త్రిష క్షమాపణలు చెబితే కానీ తాము వెనక్కి తగ్గేది లేదని, అప్పటివరకూ చిత్రీకరణను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.