: 89 ఏళ్ల వయసులో ఒంటరిగా ప్రపంచయాత్ర చేస్తున్న బామ్మగారు!


ప్రపంచంలో ఉన్న ప్ర‌సిద్ధ ప్ర‌దేశాలన్నింటినీ చూస్తూ విహారయాత్రలు చేసేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. అయితే, ఆర్థిక, అనారోగ్య, కుటుంబ ప‌రిస్థితులు బాగోలేక ఎంతో మంది క‌ల నెర‌వేర‌కుండానే పోతుంది. వ‌య‌సు మీద‌ప‌డ‌డంతో ఆర్థిక ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక కూడా కొంద‌రు విహార‌యాత్ర‌లు చేయ‌కుండా పోతారు. 60 ఏళ్లు దాటితే కృష్ణారామా అనుకుంటూ ఇంట్లోనే కూర్చుంటారు. అయితే, రష్యాకు చెందిన ఓ బామ్మ మాత్రం అందుకు విభిన్నం. ప్రపంచం మొత్తం చూసేయాల‌ని 89 ఏళ్ల వ‌య‌సులో బ‌య‌లుదేరింది. వివ‌రాలు చూస్తే... ఈ బామ్మ పేరు బాబా లీనా. ఆమె 1970లో ప్ర‌పంచం మొత్తం తిరిగిరావాల‌ని కోరుకుంది. అప్ప‌ట్లో  పోలాండ్‌, జర్మనీలో ఉన్న ప‌లు ప్ర‌దేశాల‌ను చూసేసింది.

అయితే, ఆ రెండు దేశాల ప‌ర్య‌ట‌న‌ల‌తోనే తన యాత్ర‌ను ఆపేసింది. డబ్బులతో పాటు సమయం లేకపోవడమే అందుకు కార‌ణం. అప్ప‌టి నుంచి త‌న క‌ల‌ను మ‌న‌సులోనే దాచుకొని ఉంటోంది. అయితే, ఆరేళ్ల కిత్రం త‌న‌ కలను నెరవేర్చుకునేందుకు మ‌ళ్లీ విహార‌యాత్ర‌కు బయలుదేరింది. ఈ విష‌యాన్ని ప్ర‌పంచానికి తెలిపింది మాత్రం రష్యాకు చెందిన పర్యాటకురాలు ఎకటెరినా పపినా. విహారయాత్ర చేస్తూ వియాత్నాంకి వచ్చిన ఆ బామ్మను కలిసిన తర్వాత బాబా లీనా.. ఆ బామ్మ ప్ర‌పంచాన్ని చుడుతున్న విష‌యాన్ని ఆమె త‌న‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

అనంత‌రం ఈ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టి అందరికీ తెలిసిపోయింది. యాత్ర‌ను కొన‌సాగిస్తోన్న ఆ బామ్మ ఇప్పటికి పోలాండ్‌, వియత్నాం, చెక్‌ రిపబ్లిక్‌, జ‌ర్మ‌న్నీ దేశాల్లో ప్రసిద్ధ ప్ర‌దేశాలన్నింటినీ చూసింది. త‌న‌ 90 వ పుట్టినరోజు నాటికి డొమినికన్‌ రిపబ్లిక్‌ చేరుకోవాలని భావిస్తోంది. ప్ర‌స్తుతం అమెకు పెన్షన్‌ డబ్బులు వ‌స్తున్నాయి. వాటి నుంచి దాచుకున్న మొత్తంతోను, కుటుంబ స‌భ్యుల సాయంతోను ఈ బామ్మగారు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.

  • Loading...

More Telugu News