: తప్పతాగి, యాక్సిడెంట్ చేసి.. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన హైదరాబాద్ యువతి!
పూటుగా మద్యం తాగిన ఓ యువతి, హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపుతూ ఉరుకులు, పరుగులు పెట్టించింది. సోమవారం అర్ధరాత్రి బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన వేళ ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆపుతారని భావించిన సదరు యువతి, వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఓ కారును, కొన్ని బైకులను ఢీకొట్టింది. కొందరు వాహనదారులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా, దుర్భాషలాడుతూ వేగంగా వెళ్లిపోయింది. ఇక ఆమెను వెంబడించిన పోలీసులు ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ వరకూ చేజ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆమె వాహనాన్ని ఆపిన పోలీసులు, ఆమెతో పాటు కారులోనే ఉన్న ఆమె స్నేహితురాలిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆమె పోలీసులను ఇబ్బంది పెట్టింది. చివరికి మహిళా పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈమె ఓ ప్రైవేటు యూనివర్శిటీలో బీబీఏ చదువుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.