: ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించేవాళ్లం: చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అనంతరం తాము అనుకున్నది సాధించలేకపోయామని సినీనటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి అంగీకరించారు. ఈ రోజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీ గెలిచి తాము అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించేవాళ్లమని అన్నారు. ఏ కొద్ది మంది చేతుల్లోనో, ఏ వర్గం చేతుల్లోనో అధికారం ఉండేదికాదని అన్నారు. తన వంతు బాధ్యతగా తాను 103 సీట్లు బీసీలకు ఇచ్చానని చెప్పారు. మైనార్టీలకు ఎవ్వరూ ఇవ్వనన్ని సీట్లు ఇచ్చామని చెప్పారు.
తెలుగు దేశం పార్టీ కాపులకు ఇచ్చిన హామీ గురించి ఆయన మాట్లాడుతూ, కాపులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చిరంజీవి అన్నారు. పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకను పట్టడం కోసం కొండను తవ్వారని చిరంజీవి అన్నారు. మొసళ్లను పట్టడం కోసం నీళ్లన్నీ తోడేశారని, చిన్న చిన్న చేపలు ఎండిపోతున్నాయని విమర్శించారు. పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెద్దనోట్ల రద్దు చేసి 50, 60 రోజులు దాటిపోయినప్పటికీ ప్రజల కష్టాలు తీరడం లేదని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు యూపీఏకి పట్టం గడతారని ధీమా వ్యక్తం చేశారు.