: స్వామి వారి కల్యాణపు లడ్డూ లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, నాకు అలా ఉంది!: అనంత శ్రీరామ్
ఆకలితో ఉన్న భక్తుడికి స్వామి వారి చిన్న లడ్డూ లభిస్తే చాలని అనుకుంటున్న తరుణంలో, కల్యాణపు లడ్డూ లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ‘ఓం నమో వేంకటేశాయ’లో పతాక గీతం రాసిన తనకు కూడా అంతే ఆనందంగా ఉందని ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలో పాట రాస్తే చాలు అనుకునే రచయితకు, ఈ సినిమాలో పతాక గీతాన్ని రాసే అవకాశం లభించడం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు.
పతాక గీతం రాయడం ఎందుకంత కష్టమంటే.. ‘అన్నమయ్య చిత్రంలోని ‘అంతర్యామి... అలసితి..’ ఆఖరిపాట సాక్షాత్తూ అన్నమాచార్యులు రచించింది. శ్రీరామదాసు చిత్రంలోని ‘దాశరథి కరుణా పయోనిథి..’ పాటను సంస్కృతాంధ్ర వేద వాంగ్మయాలను అవపోసన పట్టిన వేదవ్యాస గారు రచించారు. అంటే, ఏ చిత్రంలోనైనా ఒక పతాక సన్నివేశానికి పాట రాయాలంటే పరపతి పొందిన, పరిణతి చెందిన రచయితలు అవసరం ఉంటుంది. అలాంటిది, పాతికేళ్లు దాటి ఏడు సంవత్సరాలు కూడా కానీ, నా చేత ఈ పతాక గీతాన్ని రాయించాలని రాఘవేంద్రరావుగారికి ఎందుకు అనిపించిందో నాకు తెలియదుగానీ, అది నా పూర్వజన్మ సుకృతం’ అని అనంతశ్రీరామ్ అన్నారు.