: నేను శశికళ వెంటే... ఊహాగానాలకు తెరదించిన నాంజిల్ సంపత్
తమిళనాట అన్నాడీఎంకే అధినేత్రిగా, జయలలిత వారసురాలిగా సత్తా చాటాలని భావిస్తున్న శశికళా నటరాజన్ ఒక్కొ అవరోధాన్నీ దాటుతున్నారు. పార్టీ నుంచి బయటకు వస్తారని భావిస్తున్న ప్రచార ఉప కార్యదర్శి నాంజిల్ సంపత్ చిన్నమ్మ ఆధిపత్యానికి తలాడించారు. ఆమెతో భేటీ అయి చర్చలు జరిపిన అనంతరం, ఆమె నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. జయలలిత మరణం తరువాత శశికళతో విభేదిస్తున్నట్టు ఇంతవరకూ సంకేతాలు పంపిన నాంజిల్, టీవీ చానళ్లలో సైతం ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఆమె తనకు తెలియదని, ఎప్పుడూ కలవలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వీడవచ్చని ఊహిస్తుండగా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆయన పోయెస్ గార్డెన్ కు వచ్చి శశికళను కలిసి మాట్లాడారు. ఆమెను కలిసిన తరువాత తనకు సంతృప్తి కలిగిందని, తదుపరి స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రంగంలోకి దిగుతున్నానని తెలిపారు. గతంలో జయలలిత బహూకరించిన కారును, ఆమె మృతి తరువాత తిరిగిచ్చిన నాంజిల్, తిరిగి కారును తీసుకు వెళ్లనున్నట్టు కూడా తెలిపారు.