: సైకిల్ మాదే.. మెజారిటీ సభ్యుల మద్దతు మాకే!: ఈసీని ఆశ్రయించిన అఖిలేష్ గ్రూప్
యూపీలో రాజకీయం మరింత వేడెక్కింది. తండ్రీ కొడుకుల పోట్లాట తారస్థాయికి చేరింది. సైకిల్ గుర్తు మాదంటే మాదని పోటీపడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి అఖిలేష్ బృందం అయితే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి సైకిల్ గుర్తుపై సర్వాధికారాలు తమకే ఉన్నాయని, మెజారిటీ సభ్యుల మద్దతు తమకే ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించిన మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అఫీస్ బేరర్ల సంతకాలు చేసిన అఫిడవిట్లను ఎన్నికల సంఘానికి సమర్పించి సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని కోరింది.
మొత్తం 229 మంది ఎమ్మెల్యేల్లో 212 మంది, 68 మంది ఎమ్మెల్సీల్లో 56 మంది, 24 మంది ఎంపీల్లో 15 మంది, 5వేల మంది ప్రతినిధుల్లో 4600 మంది డెలిగేట్ల మద్దతు తమకే ఉందంటూ వారి సంతకాలతో కూడిన అఫిడవిట్లను అఖిలేష్ సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్ శనివారం ఈసీకి సమర్పించారు. కాగా అఖిలేష్, తండ్రి ములాయం మధ్య రాజీ కుదిర్చేందుకు శనివారం లఖనవ్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదురకపోవడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.