dyavuda: ‘ద్యావుడా’ సినిమాపై భజరంగ్ దళ్ ఫిర్యాదు.. దర్శక, నిర్మాతల ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక!
దర్శకుడు సాయిరాం దాసరి తెలుగులో తెరకెక్కిస్తున్న‘ద్యావుడా’ సినిమాపై అభ్యంతరాలు తెలుపుతూ ఇటీవలే నేరేడ్‌మెట్ పోలీసులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్‌లోనూ పలువురు భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. సదరు చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌లో పలు అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని వారు చెప్పారు.
ఆ సినిమా దర్శక, నిర్మాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. టీజర్‌లో బీరుతో శివలింగానికి అభిషేకం, సిగరెట్‌తో ధూపం వెలిగించడం, వెంకటేశ్వర స్వామి ఫొటోను నేలకేసి కొట్టడం వంటి సన్నివేశాలు కనిపించాయని, ఈ టీజర్‌ను సోషల్‌మీడియా, యూట్యూబ్‌ల నుంచి తొలగించకపోతే దర్శక, నిర్మాతల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.