: బాబు జనం మధ్యకు వస్తే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది: జగన్ తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబు తన అద్దాల మేడలో నుంచి కనుక బయటకు వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన రైతు భరోసా యాత్ర రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కొనుగోలు చేస్తే బాబు గెలవలేరని విమర్శించారు. ఎంత మందిని కొన్నాం, ఎంత సంపాదించామన్నదే చంద్రబాబుకు కావాలని, ఎంతకాలం బతికామన్నది కాదు కావాల్సింది, ఎలా బతికామన్నది ముఖ్యమని, ఆ విషయాన్ని బాబు గుర్తుంచుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో చంద్రబాబుకు జ్ఞానోదయం కావడం కోసం మనమంతా ఒక్కటి కావాలని, మీ అందరి దీవెనలు తనకు కావాలని జగన్ కోరారు. కేబినెట్ లో రైతు రుణమాఫీపై చర్చించడం లేదని, రైతుల భూములను లాక్కొని అమ్ముకోవాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో నలభై ఐదు మంది రైతులు చనిపోయినట్లు చెబుతున్నారు. కానీ, నలుగురికే ఎక్స్ గ్రేషియా చెల్లించారని ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తానన్న బాబు మాటలు నమ్మిన రైతులు, ఈరోజు అప్పుల పాలై రోడ్డున పడ్డారని జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలకు చంద్రబాబు గండి కొట్టారని జగన్ మండిపడ్డారు