: న్యూ ఇయర్‌కి గ్రీటింగ్ కార్డులు కాదు... పోస్ట్‌లో బతికున్న పాములను పంపించారు!
ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ స్నేహితులు, బంధువులకు ఎంతో మంది పోస్ట్ ద్వారా గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు పంపించుకున్నారు. అయితే, ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్వేల్స్లోని ఓ పోస్టాఫీసుకు ఓ వింత పార్శిల్ వచ్చింది. పోస్టులో వచ్చే వాటిలో సాధారణంగా గ్రీటింగ్ కార్డులు, చిన్న చిన్న గిఫ్టులే ఉంటాయనుకున్న సిబ్బందికి ఓ భయంకర అనుభవం ఎదురయింది. రెండు రోజు క్రితం ఆ పోస్టాఫీస్‌లో పార్శిల్స్‌ను, వాటి చిరునామాలను పరిశీలిస్తున్న సిబ్బంది ఓ పార్శిల్ లో పాములు ఉన్నట్టు గుర్తించారు. దీంతో భయపడిపోయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
చివరికి పాములు పట్టేవాడిని పిలిపించి పార్శిల్ విప్పించారు. అందులో మూడు బతికున్న పాములు బయటపడ్డాయి. ఒక్కోపాము 0.2 మీటర్ల నుంచి 1.2 మీటర్ల పొడవు వున్నాయని, అవి ఏ జాతి పాములన్న విషయం ఇంకా తెలియరాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై ఆ దేశ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాములను పట్టుకుంటుండగా నిక్షిప్తమయిన సీసీటీవీ ఫొటోలను అధికారులు విడుదల చేశారు.