: చైనాలో అంతే... క్యూ కడుతున్న వేలాదిమంది విద్యార్థులు!
ఆ విద్యార్థులు భారీగా క్యూ లైన్లు కడుతున్నారు. అయితే, సినిమా టిక్కెట్ల కోసమో, ఎన్నికల్లో ఓట్లు వేయడం కోసమో కాదు... చదువుకోడానికి! అవును.. చైనాలో విద్యార్థులు ప్రస్తుతం పోస్ట్ గ్యాడ్యుయేషన్‌లో ప్రవేశాలు పొందడానికి ప్రవేశ పరీక్ష కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అక్కడి విద్యార్థుల్లో అధిక శాతం మంది లైబ్రెరీలలోనే చదువుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. అందుకు తగ్గట్లుగానే ఆ దేశవ్యాప్తంగా లైబ్రెరీల్లో వాటిని ఎప్పుడూ మూసివేయకుండా నిత్యం తెరిచే ఉంచుతారు. ఏ సమయంలోనైనా లైబ్రరీకి రావచ్చు. విశ్వవిద్యాలయాల్లో ఉండే గదుల్లో చాలినన్ని పుస్తకాలు ఉండవు. ఆన్లైన్లో పుస్తకాలు చదవడానికి ఇరుకైన గదుల్లో కూర్చోవలసి వస్తుంది. అందుకే చైనా విద్యార్థులు వర్సిటీల్లో ఉండే లైబ్రరీలకు చదువుకోవడానికి వెళుతుంటారు. ఎంతో మంది విద్యార్థులు వాటిపైనే ఆధారపడి చదువుకొనసాగిస్తుంటారు.
ప్రస్తుతం జెజియంగ్ ప్రావిన్స్‌లో హాంగ్జోవు డియాంజి యూనివర్శిటీలోని లైబ్రెరీ వద్దకు వెళ్లి చూస్తే మనకు ఓ సీన్ కనపడుతుంది. 528 సీట్లు మాత్రమే ఉండే ఈ లైబ్రెరీ ముందు వేల సంఖ్యలో విద్యార్థులు క్యూ కట్టి నించుంటారు. దీంతో అక్కడ
టిక్కెట్ పద్ధతి పాటిస్తూ విద్యార్థులను అనుమతిస్తున్నారు. ఆ టిక్కెట్ పొందడానికి బారులు తీరి నిల్చుంటున్నారు. చైనాలోని ఈ ఒక్క వర్సిటీ లైబ్రెరీలోనే కాదు, అన్ని వర్సిటీల లైబ్రెరీల ముందూ ఇదే సీన్ కనపడుతోంది. దీంతో విద్యార్థులు చదువుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూడాలని అక్కడి అధికారులు యోచిస్తున్నారు.