: చిన్నమ్మకు స్వాగతం పలకని అమ్మ సొంత నియోజకవర్గ ప్రజలు!
తమిళనాడులో ఇప్పుడంతా దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పేరు మారుమోగుతుంటే, జయ సొంత నియోజకవర్గం ప్రజలు మాత్రం ఆమెను స్వాగతించేందుకు ముందుకు రావడం లేదు. ఆమె తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓట్లు వేయబోమని పలువురు స్పష్టం చేస్తుండటం గమనార్హం. జయలలిత మరణించి 30 రోజులు అయిన సందర్భంగా ఆర్ కే నగర్ పార్టీ నేత, న్యాయవాది పీ వెట్రివేల్ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన జరిగింది. ఆపై పలువురు శశికళకు వ్యతిరేకంగా మాట్లాడారు.
"మేము కేవలం అమ్మకు మాత్రమే విధేయులం. చిన్నమ్మకు చెప్పండి, ఆమె వస్తే మేము ఓట్లు వేయబోము" అని సీనియర్ సిటిజన్ పి.కుప్పు వ్యాఖ్యానించగా, "అమ్మ ఆసుపత్రిలో 77 రోజులు ఉంటే, ఒక్కసారి కూడా ఆమెను మాకు చూపని శశికళకు మద్దతిచ్చేది లేదు" అని వి. పద్మ అనే మహిళా కార్యకర్త స్పష్టం చేశారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మాత్రమే అమ్మకు నిజమైన వారసురాలని మరో మహిళా కార్యకర్త రాజ్యలక్ష్మి అన్నారు.
కాగా, ఆర్ కే నగర్ లో తనపై ఉన్న వ్యతిరేకత గురించి శశికళకు సైతం సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె అసెంబ్లీకి రావాలంటే, ఆర్ కే నగర్ బదులు మధురై నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నట్టు సమాచారం.