: 'పీకే', 'సుల్తాన్' రికార్డులను దాటేసిన 'దంగల్'... 13 రోజుల్లోనే రికార్డు వసూళ్లు: తరణ్ ఆదర్శ్
బాలీవుడ్ మిస్టర్ పెర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టేస్తోంది. రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమిర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ వసూళ్ల రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమా తాజాగా సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ కలెక్షన్లను సైతం అధిగమించింది. దీంతో 2016లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా 'దంగల్' నిలిచిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపాడు.
ఈ సినిమా నేటికి ఇండియన్ బాక్సాఫీసు వద్ద 304.45 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని తెలిపాడు. ఇప్పటి వరకు భారీ వసూళ్లు సాధించిన సినిమాగా 'సుల్తాన్' పేరిట ఉన్న 304 కోట్ల రూపాయల రికార్డును 'దంగల్' అధిగమించింది. దీనిని అధిగమించేందుకు 'దంగల్' కు కేవలం 13 రోజులు మాత్రమే పట్టడం విశేషం. ‘పీకే’ 17 రోజుల్లో 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని, దీనిని 'దంగల్' కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని ఆయన వెల్లడించారు.