: మురళీ మనోహర్ జోషీని ఓడించిన ఎస్పీ నేత కిందపడి గాయపడ్డారు...ములాయం ఆందోళన
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రేవతి రమణ్ సింగ్ అలహాబాద్ లోని తన నివాసంలో కిందపడి గాయాలపాలయ్యారు. 73 ఏళ్ల రేవతి రమణ్ సింగ్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను హుటాహుటీన ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల సమయంలో పార్టీ సమస్యలతో సతమతమవుతున్న సమయంలో సీనియర్ నేత కిందపడి గాయపడడం సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ను ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆయన ఆరోగ్యపరిస్థితిపై ములాయం ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రేవతి రమణ్ సింగ్ అలహాబాద్ లోక్ సభ స్థానం నుంచి గతంలో రెండుసార్లు విజయం సాధించగా, అందులో ఒకసారి బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషిని కూడా ఓడించడం విశేషం.