: సీన్ రివర్స్... బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల్లో వేధించిన యువకుడిని చితకబాదిన అమ్మాయి!
ఇటీవల జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో బెంగళూరులో యువకులు తప్పతాగి యువతులపై ప్రవర్తించిన తీరు దేశంలోని అందరికీ ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. గుంపుగా ఉన్నప్పటికీ ఆ యువతులు యువకులని ఎదిరించలేకపోయారు. అయితే, అదే బెంగళూరులో అదే డిసెంబరు 31న ఓ అమ్మాయి మాత్రం తనను వేధించడానికి వచ్చిన ఓ యువకుడిని చితకబాదింది. ఒంటరిగా వెళుతున్న ఆమె వద్దకు ఓ ఆకతాయి వచ్చి అసభ్యంగా తాకాడు. వెంటనే అతడిని పట్టుకుని పిడికిలి బిగించి చితక్కొట్టింది. ఆ కామాంధుడిని కాలితో తన్నింది. తనకు జరిగిన ఈ అనుభవాన్ని చైతలీ వాస్నిక్ అనే సదరు యువతి సోషల్‌మీడియాలో పంచుకుంది.
ఈ పోస్టును చూస్తోన్న నెటిజన్లు ఆమెను 'వీరనారి' అంటూ ప్రశంసిస్తున్నారు. రోడ్డుపై పోలీసులు ఉండటంతో భయపడకుండా ముందుకు వెళ్లానని, అయితే, కాస్త దూరం వెళ్లాక ఓ యువకుడు వచ్చి తనను తాకాడని ఆమె పేర్కొంది. తాను ఆ యువకుడిని చితక్కొడుతుండగా స్థానికులు అక్కడికి వచ్చి విడిపించారని చెప్పింది. ఆ కామాంధుడు ఏ తప్పూ చేయలేదని అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడని, దీంతో మరింత కోపంతో మళ్లీ కొట్టానని చెప్పింది. ఇంతలో పోలీసులు అక్కడకు వస్తుండడాన్ని గమనించి ఆ యువకుడు పారిపోయాడని పేర్కొంది.