: ‘సింగరేణి’లో అవకతవకలపై దర్యాప్తు జరపాలి: కిషన్ రెడ్డి డిమాండ్
సింగరేణిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయనీ, ఏటా రూ.100 కోట్ల సామగ్రి అక్రమంగా రవాణా అవుతోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో సింగరేణి అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో నెలకొన్న అవినీతి, కుంభకోణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో పని చేసే కార్మికులు అనారోగ్యం బారినపడుతున్నందున వారిని ఆదుకొనే దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, బొగ్గు కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
సింగరేణిలో పదవీ విరమణ పొందుతున్న వారి కంటే ఎక్కువ మందిని ఉద్యోగాల్లో నియమించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సింగరేణికి బకాయిపడ్డ సంస్థల నుంచి వాటిని రాబట్టాలని, తక్కువ వ్యయంతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, సింగేణిలో భూగర్భజలాలు దెబ్బతింటున్నాయని, ఈ ప్రాంతాల్లో హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.