: 'పాత నోట్ల' నిర్ణయాలపై మేమేమీ చేయలేం... ఆర్బీఐదే ఫైనల్: అరుణ్ జైట్లీ
రద్దయిన పాత నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే ఎటువంటి నిర్ణయాన్నీ తాము ఆక్షేపించబోమని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిసెంబర్ 30 నాటితో పాత నోట్ల డిపాజిట్ గడువు పూర్తి అయిందని, గడువు పొడిగింపు నిర్ణయాధికారం తమ చేతుల్లో లేదని ఆయన తెగేసి చెప్పారు. పలువురు బ్యాంకు కస్టమర్లు తమ వద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులకు రాగా, బ్యాంకు అధికారులు వారిని అడ్డుకుంటున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో జైట్లీ స్పందించార
పాత నోట్ల రద్దుపై నియమ, నిబంధనలను రూపొందించేది రిజర్వ్ బ్యాంకేనని స్పష్టం చేశారు. నోట్ల రద్దును నవంబర్ 8 నాడు ప్రకటించిన సమయంలోనే సాధారణ ప్రజలకు డిసెంబర్ 30 వరకూ సమయమిచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. అత్యధికులు ఇప్పటికే తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారని తెలిపారు. ఇకపై పాత నోట్లను డిపాజిట్ చేసుకోరాదన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలను తాము గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఎవరి వద్దనైనా ఇంకా పాత నోట్లుంటే, రిజర్వ్ బ్యాంకు కార్యాలయాలకు వెళ్లి, నిబంధనల మేరకు పత్రాలను దాఖలు చేసి నోట్లను మార్చుకోవచ్చని తెలిపారు.