: తారల మేనేజర్లకు చెక్ పెడుతూ... దక్షిణాది సినీపరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చబోతున్న రానా!


వైవిధ్యమైన పాత్రలతో ఇటు టాలీవుడ్ లో దూసుకుపోతుండటమే కాకుండా, అటు బాలీవుడ్ లో సైతం తనదైన ముద్ర వేసిన రానా దగ్గుబాటి... ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ ముఖచిత్రాన్నే మార్చేసే పనిలో ఉన్నాడు. కోట్లాది రూపాయల డబ్బు చేతులు మారే ఈ పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి స్వీకారం చుట్టబోతున్నాడు. వివరాల్లోకి వెళితే, సినీ స్టార్లకు పర్సనల్ మేనేజర్స్ ఉండటం తెలిసిందే. సినిమా ప్రాజెక్టులు, డేట్స్, రెమ్యునరేషన్స్ అన్నీ మేనేజర్సే చూసుకుంటుంటారు. దీనికి సంబంధించి మేనేజర్లు కమిషన్ రూపంలో ప్రతిఫలం పొందుతుంటారు. ఇదే పాయింట్ మీద రానా వ్యాపారం చేయబోతున్నాడు. ఈ మేనేజర్ల వ్యవస్థకు మంగళం పాడేలా.. 'క్వాన్' అనే టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని ఇటీవల స్థాపించారు. ఈ కంపెనీకి సంబంధించి సౌత్ ఇండియా హెడ్ రానానే!

టాలీవుడ్ విషయానికి వస్తే రకుల్ ప్రీత్, సమంత, తమన్నా, నయనతార, అనుష్క, నిత్యా మీనన్, రాశీ ఖన్నా, మెహ్రీన్ లాంటి హీరోయిన్లంతా అన్ని విషయాలకు తమ మేనేజర్ల మీదనే ఆధారపడి ఉన్నారు. టాలీవుడ్ లోని చాలా మంది హీరోల పరిస్థితి కూడా ఇదే. కొన్ని సార్టు ఐదారు మంది స్టార్లను ఒకే మేనేజర్ చూసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్ లో 20 నుంచి 30 శాతం వరకు మేనేజర్లు కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు. వీరి రెమ్యునరేషన్లు లక్షల నుంచి కోట్ల వరకు ఉండటంతో... మేనేజర్లు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే పాయింట్ మీద రానా వ్యాపారం చేయబోతున్నాడు.

తమ ప్రొఫెషనల్ మేనేజ్ మెంట్ సంస్థ ద్వారా ఆర్టిస్టుల డేట్స్ దగ్గర నుంచి రెమ్యునరేషన్స్ వరకు అన్నీ చక్కబెట్టబోతున్నాడు రానా. సినీ పరిశ్రమలో తన కుటుంబ నేపథ్యం, స్వతహాగా తోటి ఆర్టిస్టులతో తనకున్న పరిచయాలు తన వ్యాపారానికి బాగా ఉపకరిస్తాయని రానా భావిస్తున్నాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా, సౌతిండియా సినీ ఇండస్ట్రీ మొత్తానికి తన సంస్థను విస్తరించనున్నాడు.

మన దేశ సినీ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని... సంప్రదాయ స్టుడియో మోడల్ నుంచి, హాలీవుడ్ మేనేజ్ మెంట్ మోడల్ కు మనం మారుతున్నామని ఈ సందర్భంగా రానా చెప్పాడు. ఇప్పటికే ఇలాంటి వ్యాపారంలో పూరీ జగన్నాథ్, ఛార్మి కూడా ఉన్నారు. ప్రధానంగా వీరు ముంబైనుంచి ఇక్కడ అడుగుపెట్టే హీరోయిన్లపై దృష్టి సారిస్తున్నారు. సొంతంగా తన సినిమాల్లో కూడా పూరీ అవకాశం ఇస్తున్నాడు.  

సునీల్, మంచు విష్ణు, ఆది పినిశెట్టి, రాజ్ తరుణ్, నిఖిల్, జయసుధ లాంటి వాళ్లకు నటుడు రాజా రవీంద్ర మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, ప్రొఫెషనలిజంతో పనిచేసే అంశంలో రానా ప్రాజెక్టు బాగానే ఉందని... కానీ, అంత ఈజీ ఏమీ కాదని చెప్పాడు. రానాకు ఉన్న పరిచయాలతో కొంత మంది అతనితో చేతులు కలపొచ్చని తెలిపాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యాక్టర్లయితే రానాతో వెంటనే చేతులు కలుపుతారని... పెద్ద స్టార్లు అంత ఈజీగా ఒప్పందం చేసుకోరని చెప్పాడు. అయితే, రానా మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News