: నో డౌట్.. మగవాళ్లే ఎదురు కట్నమిచ్చే రోజులు వస్తాయి.. చంద్రబాబు చమక్కులు
మగవాళ్లే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో భాగంగా బుధవారం ఆరవ మహిళా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వతహాగా మహిళలు ఆర్థికంగా శక్తిమంతులైతే అంతా వారి మాట వింటారని అన్నారు. తన భార్య పారిశ్రామిక వేత్త కావడంతో సహజంగానే తన కుమారుడు ఆమె మాటే ఎక్కువ వింటాడని చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
మహిళా సాధికారతతో త్వరలోనే వరకట్నం వంటి దురాచారాలు మాయమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మగవాళ్లే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే వ్యవసాయం వంటి రంగాల్లో పనిచేయాల్సి వచ్చేది కాబట్టి మహిళలను ఇంటికే పరిమితం చేసేవారని అన్నారు. కానీ నేడు ఐటీ వంటి విజ్ఞానాధారిత రంగాల్లో శారీరక శ్రమ లేదు కాబట్టి, మహిళలు ఆయా రంగాల్లో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. అవకాశాలు కల్పించాలే కానీ అద్భుతాలు సృష్టించే సత్తా వారికి ఉందని చంద్రబాబు అన్నారు.