: బస్సులపై కూడా మొక్కల పెంపకం.. స్పెయిన్ వినూత్న ఆలోచన!
వినడానికే విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం మనిషి పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు. నగరాలన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి ఉపశమనం పొందేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశ రాజధాని మాడ్రిడ్ లో తిరిగే సిటీ బస్సులు, బస్ స్టాపులపై చిన్న చిన్న ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తాము తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయంతో, నగరంలో పెరిగిపోతున్న ధ్వని, వాయు కాలుష్యాలు తగ్గిపోతాయని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు బస్సుల్లో చల్లదనాన్ని కూడా పెంపొందించవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో, బస్సులపై మొక్కలను పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో తిరిగే బస్సులపై మొక్కలు పెంచుతారు. ఆ తర్వాత మాడ్రిడ్ మొత్తానికి ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పులనే తీసుకురావొచ్చు. ఈ పథకం సక్సెస్ అయితే... ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాల్లో ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది.