: మహామహుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన 104వ సైన్స్ కాంగ్రెస్... ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం


104వ భారత సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు ప్రారంభసభకు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ, వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కూడా మారాల్సిన అవసరం ఉందని అన్నారు.

సవాళ్లను ఎదుర్కొంటూ భారత శాస్త్రవేత్తలు ముందుకు సాగుతున్నారని, వారికి తన అభినందనలని అన్నారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని, ప్రభుత్వం సైతం అధికంగా నిధులిచ్చి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. పర్యావరణంతో పాటు నీటి శుద్ధి రంగాలు ఎంతో కీలకంగా మారాయని, ఈ రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని, వీటి పరిష్కారానికి సైంటిస్టులు కదలాలని చెప్పారు. 12 కీలక రంగాలపై ప్రత్యేక దృష్టిని సాగించాల్సి వుందని, సైబర్, రోబోటిక్స్ రంగాలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి వుందని పిలుపునిచ్చారు.

డిజిటల్ ఇండియా ద్వారా మాన్యుఫాక్చరింగ్ రంగ అభివృద్ధికి కృషి జరుగుతోందని నరేంద్ర మోదీ తెలియజేశారు. వ్యవసాయం, విద్య, సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులతో పాటు హాని చేసే సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రపంచాన్ని ముందుకు నడిపేలా మన శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని కోరారు. అందుకు వేసే ప్రతి అడుగుకూ తన మద్దతు ఉంటుందని తెలిపారు.

సమాజ సాధికారతకు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు దేశ ప్రజలు కృతజ్ఞతతో ఉంటారని, దీర్ఘకాల ప్రయోజనాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. యూనివర్శిటీలు, ఐఐటీలు, స్టార్టప్ సంస్థలు, మంత్రిత్వ శాఖలూ సమన్వయంతో పనిచేయాలని, 2030 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో ఇండియా ఒకటిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ రంగాల్లో ల్యాబొరేటరీల నిర్వహణను మరింత సులభతరం చేయాల్సి వుందని, అందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులిచ్చి ప్రోత్సహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పాఠశాలల స్థాయి నుంచే విద్యార్థుల ఆలోచనల మదింపు జరగాలని, కొత్త ఆలోచనలు విద్యార్థుల నుంచి వచ్చినప్పుడు, అధ్యాపకులే ప్రోత్సహించాలని కోరారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక విధానాలు వికసించేలా నీతి ఆయోగ్ పలు నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని, ఈ సదస్సు పలు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేశారు.

  • Loading...

More Telugu News