: భారత్ పై ఐఎస్ఐఎస్ దాడి ఎలా జరగబోతోంది?.. ఇంటరాగేషన్లో వివరించిన ఉగ్రవాది!
భవిష్యత్తులో భారత్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉందని విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, మన దేశంపై తూర్పు సరిహద్దు వైపు నుంచి ఐఎస్ దాడులు మొదలవుతాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే, బంగ్లాదేశ్ లోని నిషేధిత జమాత్-ఉల్-ముజాహిదీన్ సంస్థ ఐఎస్ తో చేతులు కలిపింది. తొలుత బంగ్లాదేశ్ ను ఆక్రమించి, అక్కడ ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయడం ఈ రెండు సంస్థల లక్ష్యం. ఆ తర్వాత ఐఎస్ ఇండియాలో ప్రవేశించి, తీవ్రమైన దాడులకు తెగబడుతుంది. జేఎంబీ ఉగ్రవాది మొహమ్మద్ మొసీయుద్దీన్ అలియాస్ ముసాను ఇంటరాగేట్ చేసే విషయంలో ఈ విషయాలు తెలిశాయి. పశ్చిమ బెంగాల్ లోని బర్ద్వాన్ లో గత జులైలో ముసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలో బేకరీపై దాడి చేసింది జేఎంబీనే.
ఇండియాలో ఐఎస్ తరపున రిక్రూట్ మెంట్లను చేపట్టడం... అవసరమైతే పాక్ లోని లష్కరే తాయిబా, జైషే ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థలతో చేయి కలిపి, భారత్ లోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో దాడులు చేయాలనేది ఐఎస్ లక్ష్యం. దీనికి తోడు కశ్మీర్ వెళ్లే టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం కూడా వీరి ప్లాన్ లో భాగంగా ఉంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బెంగాల్ లోని సెయింట్ థెరిస్సా నివాసం కూడా ఐఎస్ టార్గెట్ లో ఉన్నాయి.