: వాళ్లు ఏ ఒక్క అమ్మాయినీ విడిచిపెట్టలేదు: బెంగళూరు సిలికాన్ వ్యాలీ దురాగతంపై ప్రత్యక్ష సాక్షి
కొత్త సంవత్సరం ప్రవేశించిన శుభవేళ, శుభాకాంక్షలు చెప్పుకునేందుకు వీధిలోకి వచ్చిన ఏ అమ్మాయినీ వారు వదిలిపెట్టలేదు. ఫుల్లుగా మద్యం తాగిన యువకులు డిసెంబర్ 31 రాత్రి బెంగళూరు వీధుల్లో జరిపిన లైంగిక వేధింపుల పర్వంపై ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలివి.
"ఇక్కడో భారీ హింస జరిగింది. భయంతో అమ్మాయిలు కేకలు పెట్టారు. సాయం చేయాలని వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. యువకులు దారుణంగా ప్రవర్తించారు. ప్రతి అమ్మాయినీ చెప్పలేని ప్రదేశాల్లో తాకారు. జుట్టు పట్టి ఈడ్చారు. బలవంతంగా దగ్గరకు లాక్కున్నారు. వేలమంది సమూహంగా ఉన్నవేళ ఈ దారుణం జరిగింది. చాలా అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులు ఉన్నా ఏమీ చేయలేదు. రక్తం కారిన పరిస్థితుల్లో ఓ మహిళ ఏడుస్తుంటే చూశాను. చాలా భయం వేసింది" అని బెంగళూరు సిలికాన్ వ్యాలీ, ఎంజీ రోడ్డులో మహిళలపై జరిగిన అరాచకాలను ఆమె వివరించింది. కాగా, ఈ ఘటనలో అందుబాటులోని సీసీ టీవీ ఫుటేజ్ లన్నింటినీ పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని నగర పోలీస్ కమీషనర్ చెప్పిన సంగతి తెలిసిందే.