: అయ్యప్ప భక్తుడి వెంట 700 కి.మీ తోడుగా నడిచిన శునక నేస్తం!
మానవుడికి అత్యంత నమ్మకమైన జంతువు అంటే ముందుగా గుర్తొచ్చేది శునకమే. కుక్క పిల్లలను తెచ్చి పెంచుకుంటే, అవి ఎంతగా మచ్చికై నమ్మినబంటులా మెలగుతాయో అందరికీ తెలుసు. కానీ, పెద్ద కుక్కలు మచ్చిక కావాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఓ కుక్క ఓ భక్తుడితో పాటు 700 కిలోమీటర్ల దూరం నడిచి తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. అయ్యప్ప మాల వేసుకుని కేరళకు బయలుదేరిన కేరళలోని కోలికోడ్ వాసి నవీన్ (38)కు అదే అనుభవం ఎదురైంది.
మరిన్ని వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 8న కోలికోడ్ నుంచి నవీన్ 700 కిలోమీటర్ల నడకయాత్ర ద్వారా శబరిమలకు బయలుదేరాడు. ప్రయాణం 20 కిలోమీటర్లు సాగిన తరువాత ఓ శునకం తన వెంట వస్తోందని గమనించాడు. ఆపై అది తనను విడవడం లేదని గుర్తించాడు. మరో 80 కిలోమీటర్లు వెళ్లే వరకు ఆ శునకం అతని ప్రయాణంలో స్నేహితుడిగా మారింది. ఆపై 600 కిలోమీటర్ల దూరం అతనితోనే కలిసి ప్రయాణించింది. శునకం మెడలో అయ్యప్ప మాల వేసిన నవీన్, దానికి ఓ నల్లని బెల్టు కట్టి నడిపించాడు. దానికి 'మలు' అని పేరు పెట్టాడు. నవీన్ అలసిన వేళ అతనికి కాపలాగా మలు ఉండేది. ఓ సంరక్షకుడిలా కాపాడింది.
తన ప్రయాణపు మలి మజిలీ పంబ చేరుకోగానే, జన సముద్రంలో వీరిద్దరూ విడిపోయారు. మలు కోసం నవీన్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మలు లేకుండానే కొండపైకి వెళ్లాడు నవీన్. అన్ని రోజులూ నవీన్ తో నడిచి వచ్చిన శునకాన్ని గుర్తించిన కొందరు భక్తులు అది ఉన్న ప్రదేశం గురించిన సమాచారాన్ని నవీన్ కు అందించారు. చివరకు ఒకటిన్నర రోజుల తరువాత దాన్ని చేరుకోగా, అతన్ని చూసిన మలు, ఎగిరి దుమికి మరీ తన ప్రేమను చాటుకుంది. ఇక దాన్ని విడిచి పెట్టడం ఇష్టం లేని నవీన్, రూ. 460 పెట్టి టికెట్ కొని మరీ బస్సులో దాన్ని తన స్వస్థలానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అతనితోనే ఉంటోందీ శునకరాజం.