: తండ్రీ కొడుకుల వివాదం మధ్యలో అపర్ణ... సమాజ్ వాదీ సంక్షోభంతో చిన్న కోడలికి అదృష్టం!


ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీకి పోటీపడనున్న తమ పార్టీ అభ్యర్థులంటూ, 235 మంది పేర్లను అఖిలేష్ యాదవ్ ప్రకటించిన వేళ, అందులో లక్నో కంటోన్మెంట్ సీటుకు మాత్రం ఎవరి పేరునూ ప్రకటించలేదు. ఈ సీటును తన రెండో కొడుకు ప్రతీక్ భార్య అపర్ణా యాదవ్ కు ఇస్తున్నట్టు ఏడాది క్రితమే ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలోనే అఖిలేష్ ఆ సీటును ఖాళీగా ఉంచినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఆమె పేరును తదుపరి దశలో చేర్చే ఆలోచనలో అఖిలేష్ ఉండగానే, అఖిలేష్ సస్పెన్షన్ జరిగిపోయింది. ఇక ఈ మొత్తం సంక్షోభం వెనుక అపర్ణ సైతం తనవంతు పాత్రను పోషించినట్టు సమాచారం. ప్రస్తుతం అఖిలేష్ కు వ్యతిరేకంగా ఉన్న శివపాల్, ములాయం రెండో భార్య సాద్నా గుప్త వర్గంలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీకి యువ ప్రతినిధిగా అపర్ణను ముందు నిలిపే ఆలోచనలో శివపాల్ వర్గం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెనే సమాజ్ వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థినిగా ప్రకటించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

కాగా, అపర్ణ భర్త, ములాయం కుమారుడు ప్రతీక్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా, వ్యాపారాలు చేసుకుంటూ ఉండటంతో కోడల్ని ముందుంచి ఎన్నికలకు వెళ్లాలన్నది శివపాల్ వర్గం ఆలోచనగా తెలుస్తోంది. తన పేరును లక్నో కంటోన్మెంట్ సీటుకు ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతూ, గెలుపునకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న ఆమె, ఇకపై మిగతా రాష్ట్రంలోనూ పర్యటనలు సాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో తన భర్త ప్రతీక్ సెల్ఫీ దిగిన వేళ, ఆయనకు మద్దతు పలుకుతూ అపర్ణ వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడిక తండ్రీ, కొడుకులు ములాయం, అఖిలేష్ మధ్య విభేదాలు పెచ్చుమీరిన వేళ, పార్టీకి యూత్ ఐకాన్ గా నిలిచే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ సంక్షోభం ఆమెకు ఏ మేరకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందన్నది వేచి చూడాలి.

  • Loading...

More Telugu News