: నేటి అర్ధ రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోనున్న క్యాబ్స్... బంద్ కు పిలుపునిచ్చిన డ్రైవర్లు!
నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఓలా-ఉబెర్ క్యాబ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఓలా- ఉబర్ ప్రైవేటు వాహనాల సంస్థలు తమ డిమాండ్లు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి జనవరి 4వ తేదీ వరకు క్యాబ్ లు నిలిచిపోనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు తెలిపారు. బంద్ ను విరమించాలంటే ఓలా, ఉబెర్ క్యాబ్ లు అమలు చేస్తున్న షేర్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రోజుకు 18 బుకింగ్ ల లక్ష్యాన్ని తగ్గించి ఇన్సెంటివ్ పెంచాలని వారు సూచించారు.
అంతే కాకుండా రోజుకు 12 ట్రిప్పులతో కూడిన వ్యాపారం ఇవ్వడంతో పాటు పీక్ అవర్స్ తో సంబంధం లేకుండా ఒకే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇంకా ప్రస్తుతం ఉన్న పాత క్యాబ్ లకే బుకింగ్ లు ఇవ్వలేనప్పుడు కొత్తగా వాహనాలను చేర్చుకోవడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిని ప్రశ్నించినందుకు డ్రైవర్లపై ఓలా యాజమాన్యం బౌన్సర్లతో దాడి చేయించిందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాము బంద్ నిర్ణయం తీసుకున్నామని, నేటి అర్ధరాత్రి నుంచి 4వ తేదీ వరకు తెలంగాణలో క్యాబ్స్ తిరగవని వారు స్పష్టం చేశారు. బంద్ సమయంలో ఓలా-ఉబర్ తరఫున వాహనాలు తిరిగితే నగరంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.