: నాకు మ్యాథ్స్, 'ఫిజిక్స్' అంటే ఇష్టం.. అందుకే బీకాం తీసుకున్నా!: ఎమ్మెల్యే జలీల్ ఖాన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా పాప్యులారిటీ పెంచుకున్న టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ యాప్ లలో జలీల్ ఖాన్ మేధోసంపత్తి గురించిన ఆ వీడియో పెనుకలకలం రేపుతోంది. ఓ వెబ్ సైట్ కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రతినిధి 'మీ విద్యకు సంబంధించిన వివరాలు చెప్పాల'ని కోరాడు.
అంతే.. జలీల్ ఖాన్ తన విద్యార్హతల గురించి ఘనంగా మాట్లాడడం మొదలెట్టారు. 'బీకాం చదివాన'ని ఆయన సమాధానం చెప్పారు. 'సీఏ చేయాలన్న లక్ష్యంతో బీకాం చదివారా?' అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు. అంతే, అతనికి దిమ్మదిరిగే సమాధానం జలీల్ ఖాన్ ఇచ్చారు...'ఛఛ.. అలాంటిదేంలేదు...నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే బీకాం తీసుకున్నా'నని చెప్పారు. దీంతో వెబ్ ప్రతినిధికి మతిపోయింది.
బీకాంకి- మ్యాథ్స్, ఫిజిక్స్ కి సంబంధం ఏంటని ఆశ్చర్యపోయిన వెబ్ ప్రతినిధి... సర్దిచెబుతూ 'ఓహో మీకు అకౌంట్స్ అంటే ఇష్టమా?' అన్నాడు. మళ్లీ ఆయనకు జలీల్ ఖాన్ ఊహించని సమాధానం చెప్పి షాకిచ్చారు. 'తాను స్కూల్ డేస్ నుంచి మ్యాథ్స్ లో ఫస్టు అని, అందుకే బీకాం తీసుకున్నాన'ని అన్నారు. అప్పుడు గానీ వెబ్ ప్రతినిధికి జలీల్ ఖాన్ మేధో సంపత్తి గురించి అర్థం కాలేదు. అయినా సరే 'ఫిజిక్స్ బీకాంలో ఉండవు కదా? అని అడిగాను సర్' అన్నాడు. దీంతో 'ఎవరన్నారు? మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటాయ'ని మళ్లీ చెప్పారు. దీంతో తానేం చదివాడో మర్చిపోయేలా ఉన్నాడని సదరు ఇంటర్వ్యూయర్ ఆందోళనగా ముఖం పెట్టాడు. ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లోని స్మార్ట్ పోన్లు, సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తోంది. దీనితోపాటు మన రాజకీయనాయకుల మేధావితనంపై కూడా సెటైర్లు పడుతున్నాయి.